ఫలాహారి మహరాజ్: ఆశ్రమానికి వెళ్లిన లా విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఫలాహారి బాబా.. అరెస్టు
- రాజస్థాన్‌లో ప్రసిద్ధి చెందిన కౌశలేంద్ర ప్రపన్నచార్య ఫలాహారి మహరాజ్
- విద్యార్థినికి ఇంటర్న్‌షిప్ విషయంలో సాయం
- ఆశ్రమానికి వెళ్లిన ఆమెపై బాబా అత్యాచారం
- ఎవరికీ చెప్పొద్దని భయపెట్టినా భయపడని యువతి
రాజస్థాన్‌లో ప్రసిద్ధి చెందిన కౌశలేంద్ర ప్రపన్నచార్య ఫలాహారి మహరాజ్ (70) అత్యాచారం కేసులో ఈ రోజు అరెస్టయ్యాడు. ఓ న్యాయ విద్యార్థిని (21)కి ఆయన ఇంటర్న్‌షిప్ విషయంలో సాయపడ్డాడు. ఆయనకు కృతజ్ఞత చెప్పి, విరాళం ఇచ్చేందుకు గతనెల 7న ఆ యువతి ఆయన ఆశ్రమానికి వెళ్లింది. ఆ సమయంలోనే ఆమెపై బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలాహారీ బాబాను విచారించేందుకు పోలీసులు ఆయన ఆశ్రమానికి వెళ్లారు.
అయితే, ఆయన ఆ సమయంలో తన ఆరోగ్యం బాగోలేదంటూ ఆసుపత్రిలో చేరారు. బాబా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండటంతో నిందితుడిని పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆ బాబా బెదిరించినప్పటికీ ఆ యువతి బెదరకుండా పోలీసులను ఆశ్రయించడంతో బాబా పేరుతో కౌశలేంద్ర ప్రపన్నచార్య చేస్తోన్న అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం పండ్లను మాత్రమే ఆయన ఆహారంగా తీసుకోవడంతో ఆయనకు ఫలాహారి బాబాగా పేరు వచ్చింది.