asima chatterjee: భారత శాస్త్రజ్ఞురాలు ఆసిమా ఛటర్జీకి గూగుల్ గౌరవం
- డూడుల్‌తో గుర్తింపునిచ్చిన గూగుల్
- సైన్సులో మొదటి డాక్టరేట్ పొందిన భారతీయ మహిళ
- మలేరియా, ఎపిలెప్సీలకు మందు అభివృద్ధి
భారతదేశానికి చెందిన ప్రముఖ రసాయన శాస్త్రజ్ఞురాలు ఆసిమా ఛటర్జీ 100వ పుట్టినరోజు సందర్భంగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఆమె కోసం ప్రత్యేకంగా ఓ డూడుల్ రూపొందించింది. దేశంలో సైన్సులో డాక్టరేట్ పొందిన మొదటి మహిళ ఈమె. కోల్‌కతా యూనివర్సిటీ నుంచి ఆసిమా ఛటర్జీ డాక్టరేట్ పొందారు. మలేరియా, ఎపిలెప్సీ వంటి వ్యాధులకు మందులు అభివృద్ధి చేయడంలో ఈమె పరిశోధనలు చేశారు.
చెట్లు, మొక్కల నుంచి మందులను అభివృద్ధి చేయడానికి ప్రయోగాలు చేశారు. మడగాస్కర్ ప్రాంతంలో పెరిగే పెరివింకిల్ మొక్కల నుంచి వింకా ఆల్కలాయిడ్లను వెలికితీశారు. ప్రస్తుతం ఈ ఆల్కలాయిడ్లను కేన్సర్ కణాలను నశింపజేసే కీమోథెరపీ విధానంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. 1961లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, 1975లో పద్మభూషణ్ అవార్డును ఆసిమా ఛటర్జీ అందుకున్నారు. 1982లో రాజ్యసభ సభ్యురాలిగా కూడా నామినేట్ అయ్యారు. అలాగే భారత సైన్సు కాంగ్రెస్ అసోసియేషన్‌కు జనరల్ సెక్రటరీగా పనిచేసిన మొదటి మహిళగా కూడా ఈమె ఘనత సాధించారు.