సిరాశ్రీ: 'జై లవకుశ' టైటిల్స్ లో సహాయ రచయితలతో పాటు నా పేరు కూడా టైటిల్స్ లో వేశారు: గేయ రచయిత సిరాశ్రీ

  • 'రామ-రావణ యుద్ధ సన్నివేశం' లో డైలాగు రాసిన సిరాశ్రీ
  • అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు
  • ఈ సినిమాలో డైలాగులు రాసే అవ‌కాశం ఎలా వ‌చ్చిందో చెప్పిన సిరాశ్రీ
  • కోన వెంకట్ నన్ను ఒక రోజు పిలిచారు.. కథ చెప్పారు.. డైలాగులు రాశాను
  • ఒక్క పూట పనికే ఇలాంటి గుర్తింపు వచ్చింది

జూనియర్ ఎన్టీఆర్, బాబీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘జై లవకుశ’ సినిమాలో 'రామ-రావణ యుద్ధ సన్నివేశం' (సినిమాలో వేసిన డ్రామా) లో రామ, లక్ష్మణ, రావణ పాత్రల మధ్య పౌరాణిక సంభాషణలు అద్భుతంగా ఉన్నాయ‌ని అభిమానులే కాదు.. సినీ ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఆ డైలాగుల‌ని సినీ గేయ ర‌చ‌యిత సిరాశ్రీ రాశార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలుపుతూ వీటికి అద్భుత స్పంద‌న వ‌స్తోంద‌ని అన్నారు.

సిరాశ్రీ గేయ ర‌చ‌యితగానే కాకుండా డైలాగులు కూడా రాయ‌గ‌ల‌ర‌ని త‌మ‌కు ఇంత వ‌ర‌కు తెలియ‌ద‌ని, ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని సినీ ప్ర‌ముఖులు ప‌లువురు పేర్కొంటున్నారు. ఈ సినిమాలో ఈ డైలాగులు రాసే అవ‌కాశం ఎలా వ‌చ్చిందో సిరాశ్రీ త‌న ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వివ‌రించారు.  
 
‘జై లవ కుశ‌ లో కొన్ని పౌరాణిక శైలి డైలాగ్స్ రాయాలని రచయిత కోన వెంకట్ నన్ను ఒక రోజు పిలిచారు.. వెళ్లాను. పౌరాణికం అంటే నాకు మక్కువ ఎక్కువని కోన గారికి తెలుసు. దర్శకులు బాబీగారి సమక్షంలో మొత్తం కథను వినిపించారు. వారికి కావాల్సిన విషయం వివరించారు. నేను మాటలు పొదిగాను. పని చేసినట్టే అనిపించలేదు. అంత సరదాగా సాగిన సమయం అది. నేను ఆ పని మీద వెళ్లింది కూడా ఒక్క రోజే’ అని సిరాశ్రీ వివ‌రించారు.
 
‘కానీ, నెలల తరబడి ఎంతో కష్టపడి పని చేసిన ప్రధాన సహాయ రచయితలతో పాటు నా పేరు కూడా టైటిల్స్ లో వేయడం దర్శక రచయితలైన బాబీ, కోన వెంకట్ గార్ల పెద్ద మనసుకు నిదర్శనం. వారికి మళ్లీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పూర్తిగా కథ ఇస్తే కూడా పేరేయలేదని గొడవలకు దిగే సంఘటనలు సినిమా ఇండస్ట్రీలో వింటూ ఉంటాం. అలాంటిది ఒక్క పూట పనికే ఇలాంటి గుర్తింపు ఇచ్చే ఉదారులు కూడా ఉన్న పరిశ్రమ మన తెలుగు సినీ పరిశ్రమ అని చెప్పడానికే ఇదంతా చెప్పుకుంటున్నాను. ఆ రోజు రాసిన సంభాషణలు ఈ రోజు ఎన్టీఆర్‌ పర్ఫార్మెన్స్ లో చూస్తుంటే రోమాంఛితమయ్యింది. అది చూశాక పూర్తి సినిమాకి మాటలు రాయాలనే సరదా కూడా పుట్టింది. ఇప్పుడే మళ్లీ రెండో సారి కూడా చూసొచ్చా సినిమాని’ అని సిరాశ్రీ పేర్కొన్న‌ారు. 

  • Loading...

More Telugu News