earth: మహా వినాశనం దిశగా భూమి.. జీవజాతులు అంతరించిపోతాయంటున్న శాస్త్రవేత్తలు!
- వచ్చే 83 ఏళ్లలో మరో వినాశనం
- వాతావరణం, సముద్రంలోకి విపరీతంగా చేరిపోతున్న బొగ్గుపులుసు వాయువు
- రాక్షస బల్లులు అంతరించిపోయింది కూడా వినాశనంలోనే..!
భూమి మరో మహా వినాశనం దిశగా కదులుతోందా? ఈసారి భూమ్మీది సకల చరాచర జీవరాశులు అంతరించిపోవడం తప్పదా? అవుననే అంటున్నారు అమెరికాలోని మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన లారెన్జ్ సెంటర్ శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకు గడిచిన 54 కోట్ల సంవత్సరాల్లో ఐదు మహా వినాశనాలు చోటు చేసుకున్నాయని, 2100 సంవత్సరాని కల్లా ఆరో వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ ఐదు మహా వినాశనాల్లో ఒక దాని సందర్భంగా రాక్షస బల్లులు అంతరించిపోయాయని చెబుతున్నారు.
ఇప్పుడు ఈ శతాబ్దాంతం నాటికి సముద్రాల్లోకి బొగ్గుపులుసు వాయువు విపరీతంగా చేరిపోతుందని, తద్వారా వినాశనం మొదలవుతుందని అంటున్నారు. భూ వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ పరిమాణంలో గతంలో వచ్చిన మార్పులను విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణంలో ఈ మార్పు ఎక్కువ కాలం కొనసాగితే జీవజాతులు పూర్తిగా అంతరించిపోతాయని అంటున్నారు. ఈ వాయువు మొత్తం సముద్ర జలాల్లోకి, వాతావరణంలోకి చేరిపోతుండడం వల్ల మరో 83 ఏళ్లలో మహా వినాశనం తప్పదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.