public smoking: పబ్లిక్ లో సిగరెట్ తాగవద్దన్నందుకు యువకుడిని చంపిన న్యాయవాది
- బహిరంగ ధూమపానం వద్దన్నందుకు వాగ్వాదం
- ఆపై కారుతో బైకును ఢీకొట్టించిన న్యాయవాది మహంత
- నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థి
బహిరంగ ప్రదేశంలో ధూమపానం వద్దని చెప్పిన పాపానికి ఎంతో భవిష్యత్తున్న ఓ యువకుడి నిండు ప్రాణం బలైంది. న్యూఢిల్లీలో జరిగిన ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే, తప్పతాగిన న్యాయవాది రోహిత్ కృష్ణ మహంత, రోడ్డుపై నిలబడి సిగరెట్ తాగుతుంటే, 21 ఏళ్ల విద్యార్థి గుర్ ప్రీత్ సింగ్ వారించాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్యా కొంత వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో మహంత, తన కారును గుర్ ప్రీత్ పైకి ఎక్కించగా, దాదాపు నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విదిలాడు.
ఉత్తర ఢిల్లీలోని ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీలో కోర్సు చేస్తూ, తన స్నేహితుడు మణీందర్ సింగ్ తో కలసి, ఆదివారం తెల్లవారుఝామున 4:30 గంటల సమయంలో ఓ టీ స్టాల్ వద్ద ఆగిన సమయంలో, అదే పనిగా తమ ముఖాలపై మహంత పొగ వదులుతుండగా, తప్పని చెప్పాడు. దీంతో సదరు న్యాయవాది గట్టిగా కేకలు పెడుతూ ఉంటే, అక్కడ ఉండటం భావ్యం కాదని విద్యార్థులు తమ ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయారు.
ఆ వెంటనే తన ఫోర్డ్ ఫిస్టా కారులో విద్యార్థులను ఛేజ్ చేసిన మహంత, ఓ ఆటో, ఓలా క్యాబ్ ను ఢీకొట్టి, ఆపై గుర్ ప్రీత్, మణీందర్ ల బైక్ ను ఢీ కొట్టాడు. యాక్సిడెంట్ చేసిన రోహిత్ ను స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించగా, ఆ వెంటనే బెయిల్ మీద విడుదలయ్యాడు. ఇక ఈ ఘటనలో గాయపడిన గుర్ ప్రీత్ మరణించడంతో, న్యాయవాదిపై హత్యకేసు, డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెట్టి మళ్లీ అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.