flight: రైట్ సోదరులెవరు? విమానం కనుక్కుంది మనమే!: కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్
- రైట్ సోదరుల విమానం కన్నా ఎనిమిదేళ్ల ముందే ఇండియాలో ఎగిరిన విమానం
- తొలి విమానం కనుగొన్నది శివకర్ బాపూజీ తల్పాడే
- అంతకు వేల ఏళ్ల క్రితమే 'పుష్పక విమానం'
- ఐఐటియన్లకు బోధించాలన్న సత్యపాల్ సింగ్
విమానాన్ని కనుక్కున్నది ఎవరు? ఈ ప్రశ్నకు వెంటనే వచ్చే సమాధానం 'రైట్ బ్రదర్స్' అని. కానీ, ఇది శుద్ధ అబద్ధమని, కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ అంటున్నారు. న్యూఢిల్లీలోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను, డిప్లమో హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, విమానాన్ని భారతీయులే కనుక్కున్నారని, అదే విషయాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాల్సి వుందని తెలిపారు. రైట్ సోదరుల విమానం ఎగరక ముందు ఎనిమిదేళ్ల క్రితమే శివకర్ బాపూజీ తల్పాడే అనే ఇండియన్ విమానాన్ని తయారు చేశాడని ఆయన అన్నారు. ఐఐటీల్లో మన విద్యార్థులకు ఈ విషయాన్ని ఎందుకు బోధించడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఇక ఇదే కాలేజీలో రసాయన శాస్త్రం విద్యను అభ్యసించిన ఆయన, ఐఐటీ విద్యార్థులకు రామాయణంలో ప్రస్తావించిన 'పుష్పక విమానం' గురించి చెప్పాల్సి వుందని, సీతాదేవిని కిడ్నాప్ చేసిన తరువాత రావణుడు, తన విమానంలోనే ఆమెను లంకకు తీసుకెళ్లాడని అన్నారు. పూర్వకాలంలో ఇండియన్స్ కనుక్కొన్న ఎన్నింటినో విదేశీయులు తమ ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు.
కాగా, దీనిపై కాంగ్రెస్ నేత పీసీ చాకో మాట్లాడుతూ, కొందరు కేంద్ర మంత్రులు అన్ని లిమిట్స్ దాటి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మాట్లాడుతూ, ఇస్రో అభివృద్ధి చేస్తున్న రాకెట్లు రామబాణాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.