hasina parker: `హసీనా పార్కర్` సినిమా విషయంలో శ్రద్ధా కపూర్, నిర్మాతలపై క్రిమినల్ కేసు
- తమ వస్త్రాలను ప్రచారం చేయలేదంటూ ఫిర్యాదు
- చిత్రానికి దుస్తులు పంపిణీ చేసిన ఎమ్ అండ్ ఎమ్ డిజైన్స్
- అక్టోబర్ 26న విచారణ
`హసీనా పార్కర్` సినిమా ప్రచార కార్యక్రమాల్లో తమ వస్త్రాల బ్రాండ్‌ను ప్రచారం చేయడం లేదంటూ ముంబైకి చెందిన ఓ వస్త్రాల తయారీ సంస్థ శ్రద్ధా కపూర్ పైన, నిర్మాతలపైన చీటింగ్, క్రిమినల్ కేసులను పెట్టింది. ఒప్పందంలో రాసుకున్నట్లుగా శ్రద్ధా కపూర్ గానీ, సినిమా బృందం గానీ ప్రచార కార్యక్రమాల్లో తమ బ్రాండ్ `ఏజేటీఎమ్ (ఏజే మిస్త్రీ అండ్ థియా మిన్హాస్)`కు ప్రచారం కల్పించడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
సినిమాకు వస్త్రాలు పంపిణీ చేసినపుడు, ప్రచారంలో భాగంగా తమ బ్రాండ్‌ను ప్రచారం చేస్తామని చిత్ర నిర్మాతలు పేర్కొన్నట్లు వస్త్రాల తయారీ సంస్థ ఎమ్ అండ్ ఎమ్ డిజైన్స్ తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ తెలిపారు. అయితే సినిమా ప్రచారంలో ఎక్కడా బ్రాండ్ ప్రస్తావన తీసుకురావడం లేదని, అందుకే క్రిమినల్ కేసు పెట్టామని ఆయన చెప్పారు. అక్టోబర్ 26న ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగనుంది. మరోపక్క ఈ కేసు విషయంపై శ్రద్ధా కపూర్ నుంచి గానీ, నిర్మాతల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. దావూద్ ఇబ్రహీం సోదరి జీవిత కథ ఆధారంగా నిర్మించిన `హసీనా పార్కర్` సినిమా సెప్టెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది.