nawaz sharif: పాక్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌కు పెద్ద ఊర‌ట‌.. ఉప ఎన్నిక‌లో ఆయ‌న స‌తీమ‌ణి ఘ‌న విజ‌యం

  • పాక్ ఎన్నిక‌ల్లో తొలిసారి బ‌యోమెట్రిక్‌
  • కుల్సుమ్ విజ‌యంతో సంబ‌రాల్లో పార్టీ శ్రేణులు
  • ప్ర‌జావిజ‌య‌మ‌న్న నవాజ్ కుమార్తె మ‌రియం

పాక్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌కు పెద్ద ఊర‌ట ల‌భించింది. ఆయ‌న రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ష‌రీఫ్ స‌తీమ‌ణి కుల్సుమ్ న‌వాజ్ ఘ‌న విజ‌యం సాధించారు. ఎన్ఏ-120 నియోజ‌క‌వ‌ర్గానికి ఆదివారం ఎన్నిక‌లు నిర్వ‌హించ‌గా అర్ధ రాత్రి దాటిన త‌ర్వాత ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. సొంత పార్టీ పీఎంఎల్‌-ఎన్ త‌ర‌పున పోటీ చేసిన కుల్సుమ్ 14,888 ఓట్ల‌తో విజ‌యం సాధించారు. మాజీ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ), బిలావల్ భుట్టో జ‌ర్దారీ పార్టీ అభ్య‌ర్థులు కూడా బ‌రిలో నిలిచి కుల్సుమ్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు.

మొత్తం 3.20 ల‌క్ష‌ల ఓట్లు పోల‌వ‌గా కుల్సుమ్‌ 59,413 ఓట్లు సాధించి స‌మీప పీటీఐ అభ్య‌ర్థి యాస్మిన్ ర‌షీద్‌పై జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. ఈ ఎన్నిక‌ల్లో పాక్ చ‌రిత్ర‌లో తొలిసారి బ‌యోమెట్రిక్ విధానాన్ని ఉప‌యోగించారు. కాగా, ఉగ్ర‌వాది హ‌ఫీజ్ స‌యీద్‌కు చెందిన జ‌మాత్ ఉద్ ద‌వా కూడా ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసి 4 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది.

కుల్సుమ్ విజ‌యంపై ఆమె కుమార్తె మ‌రియం న‌వాజ్ మాట్లాడుతూ దీనిని ప్ర‌జా తీర్పుగా అభివ‌ర్ణించారు. ప్ర‌స్తుతం కుల్సుమ్ కేన్స‌ర్ కోసం లండ‌న్‌లో చికిత్స తీసుకుంటున్నారు. న‌వాజ్ కూడా ఆమె వెంటే ఉన్నారు. ప‌నామా పేప‌ర్ల కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న న‌వాజ్‌ను సుప్రీం కోర్టు ప్ర‌ధాని ప‌ద‌వికి అన‌ర్హుడిగా ప్ర‌క‌టించింది. దీంతో ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించాల్సి వ‌చ్చింది.

 
 
 
 

  • Loading...

More Telugu News