tollywood: ఇప్పుడు సినీ పరిశ్రమలో అలాంటి దుస్థితి నెలకొంది.. మాయాబజార్ షష్టి పూర్తి వేడుకల్లో నటుడు జయప్రకాశ్‌రెడ్డి
- అందులోని ప్రతి సన్నివేశమూ అద్భుతమే
- నటులకు అదో పాఠం
- ఇప్పుడేమో దుస్తులు కూడా అడిగి వేసుకోవాల్సి వస్తోంది
నాంపల్లి తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఆదివారం మాయాబజార్ సినిమా షష్టి పూర్తి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి చిత్రాన్ని విశ్లేషించారు. మాయాబజార్ సినిమా నటులకు నిలువుటద్దం లాంటిదని పేర్కొన్నారు. ఆ సినిమాలో సావిత్ర నటన అద్భుతమన్నారు. ఆమె శశిరేఖగా నటించడం గొప్ప విషయం కాదు కానీ, ఘటోత్కచునిగా నటించడం మాత్రం చాలా గొప్ప విషయమన్నారు. ఆ సినిమాలో ప్రతీ పాత్ర ఓ అద్భుతమని కొనియాడారు.
ఆ సినిమాలో ఏ సన్నివేశం చూసినా నటన సహజంగా కనిపిస్తుందన్నారు. అయితే ప్రస్తుతం అటువంటి నటనకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం షూటింగ్‌కు వెళ్లాక తాను ఎలాంటి దుస్తులు వేసుకోవాలో అడిగి మరీ ధరించాల్సిన దుస్థితి పరిశ్రమలో నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత వెన్నెలకంటి, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, చాయాగ్రాహకుడు ఎస్.గోపాల్‌రెడ్డి, నృత్య కళాకారిణి శోభానాయుడు, నటుడు తణికెళ్ల భరణి, సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.