Tom Uzhunnalil: ఐసిస్ ఉగ్రవాదులు నన్ను చాలా బాగా చూసుకున్నారు: కేరళ ఫాదర్ టామ్
- పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్న ఫాదర్
- చిన్నపాటి హాని కూడా తలపెట్టలేదని వ్యాఖ్య
- జ్వరం వస్తే మందులు, మధుమేహానికి ఇన్సులిన్ ఇచ్చారని ప్రశంసలు
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తనను చాలా బాగా చూసుకున్నారని, తనకు ఎటువంటి హాని తలపెట్టలేదని ఇటీవల వారి చెర నుంచి విడుదలైన కేరళకు చెందిన మతాధికారి ఫాదర్ టామ్ ఉజున్నలిల్ తెలిపారు. రోమ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఒకసారి నాకు జ్వరం వచ్చింది. కడుపులో కూడా ఇబ్బందిగా ఉంటే వారికి చెప్పాను. వారు వెంటనే మందులు తెచ్చి ఇచ్చారు. నాకున్న మధుమేహం సమస్యలు కాకుండా వారి చెరలో ఉన్నప్పుడు నాకు కలిగిన ఒకే ఒక అసౌకర్యం అదొక్కటే’’ అని టామ్ వివరించారు. తన కళ్లకు గంతలు కట్టి వివిధ ప్రాంతాలకు తిప్పారని తెలిపారు. ఒకసారి వైద్యులను పిలిపించి తనకు పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. తనకు కొన్నాళ్లపాటు ఇన్సులిన్‌ను కూడా ఇచ్చారని, ఆ తర్వాత ట్యాబ్లెట్లతో సరిపెట్టారని ఫాదర్ తెలిపారు. ఇన్సులిన్ దొరకకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు.
‘‘నేను వారి చెరలో ఉండగా రెండు బర్త్‌డేలు జరుపుకున్నా. అక్కడ నేను రోజంతా ఏం చేసేవాడినో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నేను ఏం కావాలనుకుంటే అది చేసే స్వేచ్ఛ ఇచ్చారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు లేచి నిల్చునేవాడిని, కింద కూర్చునేవాడిని. ఓ రూములో వ్యాయామాలు చేసుకోవాల్సిందిగా కూడా వారు కోరారు. దీంతో చిన్నచిన్న వ్యాయామాలు చేసేవాడిని. అంతటి స్వేచ్ఛ వారు నాకు ఇచ్చారు’’ అని ఉగ్రవాదులను టాప్ కొనియాడారు.
నిద్రకు పూర్తి సమయం ఇచ్చే వారని, వారు లేనప్పుడు ప్రార్థనలు కూడా చేసుకునే వాడినని టామ్ తెలిపారు. అయితే బ్రెడ్, వైన్ మాత్రం అందుబాటులో ఉండేవి కావన్నారు. తనను విడిపించేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, ఇతర మంత్రులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. ఫాదర్ టామ్ మంగళవారం భారతదేశానికి చేరుకునే అవకాశం ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. కేరళలోని కొట్టాయంకు చెందిన ఫాదర్ టామ్ గతేడాది మార్చిలో యెమన్‌లో అపహరణకు గురయ్యారు.