Sasikal: శశికళ రాజభోగాలను వెలుగులోకి తెచ్చిన రూపకు రాష్ట్రపతి మెడల్
- సంచలన ఆరోపణలతో వెలుగులోకి..
- శశికళ వీఐపీ ట్రీట్మెంట్ వీడియోలు విడుదల చేసింది ఆమెనే
- ఆరోపణల దెబ్బకు ట్రాఫిక్ వింగ్‌కు బదిలీ అయిన అధికారిణి
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ రాజభోగాలను వెలుగులోకి తెచ్చిన మాజీ డీఐజీ డి.రూపా మౌద్గిల్ ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి మెడల్‌ను అందుకున్నారు.
శశికళకు జైలులో సకల సౌకర్యాలు కల్పించేందుకు డీజీపీ (ప్రిజన్స్) హెచ్ఎన్ సత్యనారాయణ రావు రూ.2 కోట్లు లంచం తీసుకున్నారని రూప సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా శశికళకు జైలులో అందుతున్న వీఐపీ ట్రీట్మెంట్కు సంబంధించిన వీడియోలను ఆమె బయటపెట్టారు. ఈ విషయంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అయితే డీజీ (ప్రిజన్స్) రూప ఆరోపణలను కొట్టి పడేశారు. ఈ విషయంలో విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రూప ఆరోపణలకు మీడియాలో విస్తృత ప్రచారం లభించడంతో సత్యనారాయణ రావు రూ.50 కోట్లకు రూపపై పరువునష్టం దావా వేశారు. అనంతరం రూపను ట్రాఫిక్, సేప్టీ వింగ్‌కు బదిలీ చేశారు.