దైవ దూషణ: వాట్సప్‌లో దైవ దూషణ చేశాడని ఓ యువకుడిపై అతడి స్నేహితుడి ఫిర్యాదు.. మరణశిక్ష విధించిన పాక్ కోర్టు!
- దైవ దూషణను నేరంగా పరిగణించే పాకిస్థాన్
- క్రైస్తవ యువకుడిపై తప్పుడు అభియోగాలు మోపారన్న లాయర్
- దైవదూషణ చేస్తున్నారంటూ పాక్ లో క్రైస్తవులపై తరుచూ దాడులు
పాకిస్థాన్‌లో దైవ దూషణను నేరంగా పరిగణిస్తారన్న విషయం తెలిసిందే. ఓ వ్యక్తి తన స్నేహితుడికి వాట్సప్‌లో ఓ పద్యాన్ని పంపాడని, అందులో దైవదూషణ ఉందని నదీమ్ జేమ్స్ మసిహ్ అనే క్రైస్తవుడిపై కేసు నమోదైంది. దీంతో ఆయనకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ కేసును జేమ్స్ స్నేహితుడు యాసిర్ బషీరే వేయడం గమనార్హం. ఈ తీర్పుపై డిఫెన్స్ లాయర్ మీడియాతో మాట్లాడుతూ.. తన క్లయింట్ జేమ్స్ అమాయకుడని చెప్పారు.
జేమ్స్ ఓ ముస్లిం బాలికతో సన్నిహితంగా ఉంటున్నాడని, ఈ కారణంగానే అతడిపై తప్పుడు అభియోగాలు మోపారని అన్నారు. ఈ తీర్పును లాహోర్ హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. ఎవరయినా దైవదూషణ చేస్తే పాకిస్థాన్‌లో మత ఛాందసవాదులు వారిపై దాడులకు తెగబడతారు. అటువంటి వారిని చంపేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీంతో తనపై నేరారోపణ రాగానే జేమ్స్ ఇంటి నుంచి పారిపోయి, కొన్ని రోజులకి పోలీసులకు లొంగిపోయాడు. లాహోర్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని గుజరాత్ జైల్లోనే అతడిని న్యాయస్థానం విచారించింది.
జేమ్స్ కుటుంబానికి రక్షణ కల్పించే క్రమంలో వారిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. పాకిస్థాన్‌లో క్రైస్తవులపై దాడులు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. దైవదూషణకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మైనారిటీ క్రైస్తవులపై పదే పదే దాడులు జరుపుతున్నారు.