britan: 'అత్యంత ప్రమాదకర' స్థాయికి లండన్ ఉగ్రభయం
- నిన్నటి దాడితో వణికిపోయిన బ్రిటన్
- మరోదాడి ఎప్పుడైనా జరగవచ్చన్న ప్రధాని థెరిస్సా మే
- నిందితుల కోసం భారీ ఎత్తున సోదాలు
- జాతీయ రైల్ నెట్ వర్క్ పై మరింత దృష్టి
ఈ సంవత్సరం ఐదో ఉగ్రదాడితో వణికిపోయిన బ్రిటన్, ఉగ్రవాదుల దాడి స్థాయిని 'అత్యంత ప్రమాదకర' స్థాయికి పెంచింది. టెర్రర్ థ్రెట్ ను 'క్రిటికల్' స్థాయికి మారుస్తున్నట్టు యూకే ప్రధాని థెరిస్సా మే వ్యాఖ్యానించారు. అంటే మరో ఉగ్రదాడి ఏ క్షణమైనా జరగవచ్చని బ్రిటన్ భావిస్తున్నట్టు. కాగా, నిన్నటి దాడిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని, గాయపడిన వారిలో అత్యధికులు స్వల్పంగా కాలిన గాయాలతో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
ఈ దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసేందుకు భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని, ప్రజలకు ఈ దాడి, అందులో పాల్గొన్నవారి గురించి ఏమైనా సమాచారం తెలిస్తే పంచుకోవాలని లండన్ పోలీసులు కోరారు. ఉగ్ర స్థాయిని పెంచిన తరువాత తాము మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని, అదనంగా దళాలను బరిలోకి దింపామని, జాతీయ రైల్ నెట్ వర్క్ పై మరింత దృష్టిని సారించామని ఓ అధికారి వ్యాఖ్యానించారు. లండన్ వాసులకు కొన్ని గైడ్ లైన్స్, హెల్ప్ లైన్ నంబర్లను ఆయన విడుదల చేశారు.