: తెలుగు సినిమాలకు వేరే భాషల్లో టైటిల్స్ పెడితే అదనపు సుంకం వసూలు చేయాలి: గేయ రచయిత సిరాశ్రీ
- తెలుగు భాషను తప్పనిసరి చేసిన కేసీఆర్ నిర్ణయంపై హర్షం
- తెలుగుభాషకి గౌరవాన్ని పెంచిన పాలకుల్లో ఇప్పుడు కేసీఆర్ కూడా
- తెలుగు సినిమాల టైటిళ్ల కోసం ఇంగ్లీషుని, హిందీని ఆశ్రయించవద్దు
విద్యాలయాల్లో ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై తెలుగువారి నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. తెలుగు చలనచిత్ర ప్రముఖులు కూడా ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సినీ గేయ రచయిత సిరా శ్రీ తన సోషల్ మీడియా ఖాతాలో రాసిన అభిప్రాయాన్ని చూడండి...
‘తెలుగుభాషకి గౌరవాన్ని పెంచిన పాలకులు అనగానే నాకు వెంటనే తట్టే పేర్లు: 1. శ్రీ కృష్ణ దేవరాయలు, 2. నందమూరి తారక రామారావు. కాస్త ఆలోచిస్తే ఇంకొంతమంది తట్టవచ్చేమో గానీ, ఎటువంటి ఆలోచన లేకుండా ఠక్కున స్ఫురించేది మాత్రం ఆ ఇద్దరే. ఇప్పుడు అలా ఠక్కున చెప్పగలిగే మూడో పేరు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. రాష్ట్ర స్థాయిలో తప్పనిసరి తెలుగు విద్యాబోధన, మొదలైన అంశాల దిశగా ఆయన తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం’.
‘పనిలో పనిగా తెలుగు సినిమా టైటిల్స్ విషయంలో కూడా ఆయన ఒక అడుగు ముందుకేస్తే మంచిదని కోరుకుంటున్నాను. తెలుగు సినిమాలకు తెలుగులో కాకుండా వేరే భాషల్లో టైటిల్స్ పెడితే అదనపు సుంకం వసూలు చేయడం లాంటిది ఏదైనా ప్రవేశ పెడితే మంచిదేమో. కనీసం తెలుగు సినిమా నామకరణం విషయంలోనైనా తెలుగుని పక్కన పెట్టి ఇంగ్లీషుని, హిందీని ఆశ్రయించే పరిస్థితి అప్పుడు కచ్చితంగా మారుతుందని నా అభిప్రాయం’ అని సిరాశ్రీ పేర్కొన్నారు.