: విమానంలోకి ప్రవేశించి బ్యాగులోంచి కత్తిని తీసిన ప్రయాణికుడు
- ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన
- భద్రతా వ్యవస్థ డొల్లతనాన్ని నిరూపించి చూపించిన ప్రయాణికుడు
- సమర్థించుకున్న అధికారులు
ఓ ప్రయాణికుడు ఎయిర్‌పోర్టు భద్రతా వ్యవస్థ డొల్లతనాన్ని నిరూపించి చూపించాడు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గోవా వెళ్లాల్సిన ఓ స్పైస్‌జెట్ విమానం ఎయిర్‌పోర్టులో రెడీగా ఉంది. ప్రయాణికులంతా విమానం ఎక్కేశారు. అందరిలాగే ఓ ప్రయాణికుడు వచ్చి, విచిత్రంగా ప్రవర్తించాడు. విమానాశ్రయంలో సెక్యూరిటీ ఎలా ఉందో చూడండి అని చెబుతూ తన బ్యాగ్ లోంచి కత్తి తీసి అందరికీ చూపించాడు. అతడి ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోలేకపోయిన ప్రయాణికులు, విమాన సిబ్బంది తికమకపడ్డారు.
వెంటనే అతడిని పట్టుకుని ఎయిర్‌పోర్టు సెక్యూరిటీకి అప్పజెప్పారు. అతడు విమానం దిగగానే విమానం వెళ్లిపోయింది. సదరు ప్రయాణికుడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై స్పైస్‌జెట్ అధికారులు మాట్లాడుతూ... ప్రయాణికుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని వ్యాఖ్యానించారు. ఆ వ్యక్తి భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకునే విమానాశ్రయానికి వచ్చి ఉంటాడని చెప్పుకొచ్చారు.