: కిమ్ సామ్రాజ్యానికి 56 కిలోమీటర్ల దూరంలోకి వెళ్లనున్న ట్రంప్... దక్షిణ కొరియాకు టెన్షన్ టెన్షన్!
- నవంబరులో దక్షిణ కొరియాలో పర్యటించనున్న ట్రంప్
- కిమ్ దుస్సాహసం చేస్తాడేమోనని భయపడుతున్న కొరియన్లు
- ట్రంప్ భద్రత నిమిత్తం తరలిరానున్న ఎఫ్బీఐ
- సరిహద్దుల్లో రాడార్లు - శాటిలైట్ల కళ్లన్నీ నార్త్ కొరియాపైనే
మరో రెండు నెలల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తనకు మిత్ర దేశంగా ఉన్న దక్షిణ కొరియాలో పర్యటించనుండగా, కిమ్ జాంగ్ ఎలాంటి చర్యలకు దిగుతాడోనని సర్వత్రా ఆందోళన నెలకొంది. ఉత్తర కొరియా సరిహద్దుకు కేవలం 35 మైళ్లు... అంటే 56 కిలోమీటర్ల దూరంలోకి ట్రంప్ రానున్నారు. ఎలాంటి దుస్సాహసానికైనా తెగించే మనస్తత్వం ఉన్న కిమ్, ఏదైనా చేస్తాడేమోనని దక్షిణ కొరియా సైతం భయపడుతోంది. ట్రంప్ దక్షిణ కొరియాకు వస్తే, కిమ్ ఎలా స్పందిస్తారన్న విషయాన్ని పక్కనుంచితే, ఓ నియంత పాలిస్తున్న దేశానికి అంత దగ్గరగా అమెరికా అధ్యక్షుడు వెళ్లడం మంచిది కాదని అమెరికన్లు సైతం భావిస్తున్నారు.
ఇక దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఉత్తర కొరియాపై తీసుకునే చర్యలపై ట్రంప్ ను ప్రశ్నించగా, ఆయన నుంచి 'వేచి చూడండి' అన్న సమాధానమే వస్తోంది. కాగా, ట్రంప్ భద్రత నిమిత్తం మొత్తం అమెరికా ఫెడరల్ యంత్రాంగం వెయ్యి కళ్లతో ఉత్తర కొరియాపై నిఘాను పెట్టనుంది. సరిహద్దుల్లో మిసైల్ డిస్ట్రాయర్ల నుంచి అత్యాధునిక రాడార్లను రంగంలోకి దించనుంది. యూఎస్ అధీనంలోని శాటిలైట్లు ఉత్తర కొరియాను అనుక్షణం కనిపెట్టి ఉండనున్నాయి. ఏ క్షిపణి కదిలినా, సరిహద్దుల్లో తేలికపాటి క్షిపణులు కనిపించినా, వెంటనే ఇవి అప్రమత్తం చేస్తాయి. కిమ్ ఏదైనా చేయాలని చూస్తే చాలా ఘోరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వుంటుందని యూఎస్ అధికారి ఒకరు హెచ్చరించారు.