: విభిన్న ముగింపులతో రానున్న `గేమ్ ఆఫ్ థ్రోన్స్` సీజన్ 8!
ప్రపంచవ్యాప్తంగా `గేమ్ ఆఫ్ థ్రోన్స్` టీవీ సిరీస్ ఎంతో ప్రాచుర్యం పొందింది. వివిధ దేశాల్లో ఈ సిరీస్‌ను అక్రమంగా డౌన్లోడ్ చేసుకుని మరీ చూస్తుంటారు. ఇప్పటివరకు టెలివిజన్ చరిత్రలో ఎక్కువసార్లు అక్రమంగా డౌన్లోడ్ అయిన టీవీ షో ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. అమెరికాలో ప్రసారమైన కొద్దిసేపటికే ఈ షో ఎపిసోడ్లు ఇంటర్నెట్లో కనిపించేవి. కానీ గత రెండు సీజన్ల నుంచి షో నిర్మాతలకు హ్యాకర్ల భయం పట్టుకుంది.
హెచ్‌బీఓ ఛానల్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఎపిసోడ్లను ప్రసారానికి ముందే నెట్లో పెట్టేస్తున్నారు. అలా పెట్టకుండా ఉండాలంటే పెద్ద మొత్తం డబ్బు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సీజన్ 7లో ముఖ్యమైన రెండు ఎపిసోడ్లను ప్రసారానికి ముందే బిలియన్ల మంది చూసేశారు. దీంతో `గేమ్ ఆఫ్ థ్రోన్స్` నిర్మాతలు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ సిరీస్‌లో చివరిదైన సీజన్ 8 ఎపిసోడ్లను విభిన్న ముగింపులతో షూట్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఒక కథతో ఉన్న ఎపిసోడ్ లీక్ అయినా మరో కథను ప్రసారం చేసేందుకు ప్రయత్నిస్తామని హెచ్‌బీఓ ప్రోగ్రామింగ్ ప్రెసిడెంట్ కేసీ బ్లాయెస్ చెప్పాడు. సీజన్ 7 చివరి ఎపిసోడ్‌ను ప్రసారమైన 72 గంటల్లోనే 90 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి.