: తెలంగాణలో కాంగ్రెస్ నాయకుడి హత్య.. వేట కొడవళ్లతో నరికి చంపారు!
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం
- మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హత్య
- స్థానికంగా నెలకొన్న భయాందోళనలు
- పాత కక్షలే కారణమన్న పోలీసులు
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత శ్రీనివాసరావును గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అత్యంత దారుణంగా వేట కొడవళ్లతో నరికి చంపారు. వివరాల్లోకి వెళ్తే, అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన వేముల శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఈ ఉదయం గ్రామంలోని అయ్యప్ప హోటల్ కు టిఫిన్ చేయడానికి ఆయన వెళ్లారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా వేటకొడళ్లతో అతనిపై దాడి చేశారు. ముందు తమ వెంట తెచ్చుకున్న పెప్పర్ స్ప్రేను అతనిపై కొట్టారు. దీంతో, అప్రమత్తమైన శ్రీనివాసరావు పరుగులు తీశారు. ఆయన వెంట పడ్డ ఆగంతుకులు వెంటనే తమ వద్ద ఉన్న వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు. పట్టపగలే జరిగిన ఈ హత్యతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. గతంలో కూడా శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగిందని తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని చెప్పారు.