: నేను రాజధానిని నిర్మించేది ప్రజల కోసం.. ప్రతిపక్షం కోసం కాదు!: సీఎం చంద్రబాబు
అభివృద్ధి జరిగితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని, తమకు ఉనికి ఉండదని ప్రతిపక్ష పార్టీ భావిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన అమరావతిలోని సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తాను రాజధాని నిర్మించేది ప్రజల కోసమే కానీ ప్రతిపక్షం కోసం కాదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు రాజధాని నిర్మాణంపై అంత ప్రేమ ఉంటే కేసులు ఎందుకు వేశారని ఆయన ప్రశ్నించారు. తాము రాష్ట్రంలో జరుపుతోన్న పనులను అడ్డుకోవడమే ధ్యేయంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రజలు ప్రతిపక్షాన్ని నమ్మడం మానేశారని తెలిపారు. రాజధాని విషయంలో ప్రతిపక్ష పార్టీలు ప్రతిరోజు విమర్శలు చేస్తూనే ఉన్నాయని అన్నారు.
కాగా, ఈ రోజు తాము అమరావతి ఆకృతులపై చర్చించామని చంద్రబాబు అన్నారు. నార్మన్ ఫోస్టర్ ఆకృతులపై ఇంకా కసరత్తు జరుగుతోందని చెప్పారు. మంచి ఫలితాల కోసం కాస్త ఆలస్యమైనా ఫర్వాలేదని చెప్పారు. ప్రపంచంలోని అద్భుత భవనాల జాబితాలో రాజధాని భవనాలు ఉండాలని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఇస్తోన్న నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అగ్రిగోల్డ్, కేశవరెడ్డి సంస్థల ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయగలుగుతున్నామని అన్నారు.