: ప్రాంతీయ భాషలు మాట్లాడే వారికి గౌరవం ఇవ్వండి.... హిందీ మాట్లాడేవారికి రాష్ట్రపతి సూచన
జాతీయ భాష హిందీని దేశవ్యాప్తం చేసే ప్రాంతీయ భాషలను కించపరచవద్దని, వారికి ఎంత ఎక్కువ గౌరవమిస్తే... హిందీ భాష అంత అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ఈరోజు హిందీ దివస్ సందర్భంగా ఆయన న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో హిందీ మాట్లాడేవారిని ఉద్దేశించి మాట్లాడారు. దశాబ్దాల క్రితం హిందీని జాతీయ భాషగా చేసినా దేశంలోని పలు ప్రాంతాల్లో హిందీ వ్యతిరేకులు ఉన్నారని ఆయన తెలిపారు. ఇటీవల బెంగళూరు మెట్రో పేర్ల వివాదాన్ని, హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో జరిగిన ఉద్యమాలను గుర్తుచేస్తూ వారి మీద హిందీని బలవంతంగా రుద్దుతున్నారని దక్షిణాది ప్రాంతాల భావిస్తున్నారన్నారు.
హిందీ మాట్లాడేవారు, హిందీయేతర వ్యక్తులను కలిసినపుడు వారి భాషలోనే నమస్కారం చెప్పడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా బెలారస్ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తాను రష్యన్ భాషలో నమస్కారాలు తెలియజేస్తే, ఆ దేశ అధ్యక్షుడు లుకషెంకో హిందీలో నమస్కారాలు తెలియజేసిన విషయాన్ని కోవింద్ గుర్తుచేశారు. భాష, సంస్కృతులను ఒకరికొకరు గౌరవించుకోవడం వల్ల ఐక్యత పెంపొందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సభను ఉద్దేశించి మాట్లాడారు. హిందీ ప్రజలు కూడా అన్య భాషల పదాలను వాడటం అలవాటు చేసుకుంటే భాష మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.