: దెందులూరు సమీపంలో చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదేళ్ల చిన్నారి, ఐదుగురు మహిళల మృతి!
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని దెందులూరు మండలం కొవ్వలిలో ఓ కారు అదుపు తప్పి ఒక్కసారిగా చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో కారులోని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు వివరిస్తూ.. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి, ఐదుగురు మహిళలు ఉన్నారని తెలిపారు. వారంతా కొవ్వలిలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, వారి స్వగ్రామం కృష్ణా జిల్లాలోని మల్లవల్లి అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.