: భారత్-జపాన్‌లు ఏం సాధించగలవు?: అపహాస్యం చేసిన చైనా
జపాన్‌తో భారత్ బంధం మరింత బలపడుతుండడంతో చైనాకు కన్నుకుట్టినట్లుంది. భారత్-జపాన్‌లు ఏం సాధించగలవు? అంటూ అపహాస్యం చేస్తూ చైనా అధికారిక వార్తాపత్రిక గ్లోబెల్ టైమ్స్ ఓ కథనాన్ని రాసుకొచ్చింది. భారత్.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ను చైనాకు బదులు జపాన్‌కి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు అందుకోసం శంకుస్థాపన కూడా జరిగింది. అంతేకాదు, ఇటీవలే డోక్లామ్ ప్రతిష్టంభన విషయంలో ఇరు దేశాల సైన్యాలు ఒకేసారి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలన్న భారత్ డిమాండ్‌ను చైనా ఒప్పుకోక తప్పలేదు. దీంతో చైనా మరోసారి తన బుద్ధిని బయటపెడుతూ భారత్‌పై పలు వ్యాఖ్యలు చేసింది.
హైస్పీడ్ రైల్ విషయంలో భారత్-జపాన్ తమగోతిని తామే తవ్వుకుంటున్నాయని పేర్కొంది. ఆసియాలోని ఏ దేశం కూడా సాంకేతికంగా తమ దేశానికి సరితూగదని రాసుకొచ్చింది. ఆసియా వేగంగా అభివృద్ధి చెందుతోందనడంలో సందేహం లేదని, ఈ రేస్‌లో ఎవరు ముందుగా లక్ష్యాన్ని చేరతారో వారే విజేతగా నిలుస్తారని పేర్కొంది. తమ దేశం అన్ని రంగాల్లో ఇప్పటికే తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని తెలిపింది. కొత్తగా భారత్-జపాన్‌లు ఏం సాధిస్తాయని రాసుకొచ్చింది. ఆ ఇరు దేశాలు ఎంతగా స్నేహాన్ని పెంచుకున్నా తమకు నష్టం ఏమీలేదని పేర్కొంది. ఏమైనా, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ను అప్పజెప్పడంలో చైనా కన్నా జపానే బెటరని భావించి కీలక అడుగు వేసిన భారత్ నిర్ణయాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది.