: సీజన్ లో తొలిసారి... నాగార్జునసాగర్ ను తాకిన కృష్ణమ్మ వరద!


ఈ వర్షాకాల సీజన్ లో కృష్ణమ్మ వరద నీరు తొలిసారిగా నాగార్జున సాగర్ కు చేరుకుంది. కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటం, ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ నిండడంతో వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. ఈ ఉదయం ఆల్మట్టికి వస్తున్న 10,523 క్యూసెక్కులు, నారాయణపూర్ కు వస్తున్న 11,767 క్యూసెక్కులు, జూరాలకు వస్తున్న 27,276 క్యూసెక్కులు, తుంగభద్రకు వస్తున్న 2,869 క్యూసెక్కుల నీటిలో అత్యధిక భాగం కాలువల ద్వారా పంటపొలాలకు, దిగువకు వదులుతున్నారు.

దీంతో శ్రీశైలం జలాశయానికి 30,358 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 24 గంటల వ్యవధిలో శ్రీశైలంలో 3 టీఎంసీల నీరు చేరుకుంది. ప్రస్తుతం శ్రీశైలంలో 52 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, 5,819 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ డ్యామ్ కు విడుదల చేస్తున్నారు. ఉదయం 11 గంటల సమయంలో సాగర్ డ్యామ్ కు వస్తున్న వరదనీటి ప్రవాహం 6,463 క్యూసెక్కులుగా నమోదైంది. గత సంవత్సరం వర్షాకాల సీజన్ తరువాత ఈ స్థాయిలో నీరు సాగర్ కు చేరడం ఇదే తొలిసారి. సాగర్ నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా 970 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News