: వీడిన శ్రీలక్ష్మి అదృశ్యం కేసు చిక్కుముడి.. ఆత్మహత్య చేసుకుంటానని వెళ్లి జంటగా తిరిగొచ్చిన యువతి!
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన రామిశెట్టి శ్రీలక్ష్మి అదృశ్యం కేసు కొలిక్కి వచ్చింది. గత నెల ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె పెళ్లి చేసుకుని తిరిగొచ్చింది. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిన ఆమె సురక్షితంగా ఇంటికి చేరడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన రామిశెట్టి అజయ్‌కుమార్, లక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో ఒకరికి వివాహమైంది. అనారోగ్య కారణాలతో రెండేళ్ల క్రితం అజయ్ కుమార్ మృతి చెందాడు.
దీంతో మిగిలిన ముగ్గురు కుమార్తెలు ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్ పూర్తి చేసిన శ్రీలక్ష్మి ఖాళీగా ఉంటోంది. దీంతో డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం చేసుకోవచ్చు కదా, అంటూ అక్కలు నిలదీస్తుండడంతో మనస్తాపానికి గురైన శ్రీలక్ష్మి గత నెల 16న లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన గురించి వెతకవద్దని అందులో కోరింది. దీంతో 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, ఈనెల 11న శ్రీలక్ష్మి ఫేస్బుక్ ద్వారా తన కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపింది. తాను క్షేమంగానే ఉన్నానని, వివాహం చేసుకున్నానని తెలపడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఆమె ఆచూకీని కనుగొన్నారు. ఫేస్బుక్లో పరిచయమైన యానాంకు చెందిన పెద్దిరెడ్డి ఈశ్వరరెడ్డి అనే యువకుడి వద్దకు శ్రీలక్ష్మి వెళ్లిపోయి వివాహం చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం ఇద్దరినీ సత్తెనపల్లి తీసుకురావడంతో కథ సుఖాంతమైంది.