: భావ వ్యక్తీకరణలో నా కన్నా మోదీకి మంచి ప్రతిభ ఉంది: రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీపై, ఆయన ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసలతో పాటు విమర్శలు కురిపించారు. భావ వ్యక్తీకరణలో ప్రధాని మోదీకి మంచి ప్రతిభ ఉందని, తన కంటే చాలా బాగా ఆయన మాట్లాడతారని ప్రశంసించిన రాహుల్, మోదీతో కలిసి పనిచేసే వారి మాటలను ఆయన పట్టించుకోరట అంటూ విమర్శలు కురిపించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్, నిన్న బర్క్ లీ లోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
సభలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో మోదీకి బాగా తెలుసని, అయితే, తనతో కలసి పనిచేసే వారి మాటలను మోదీ పరిగణనలోకి తీసుకోరని ఆ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు తనతో చెప్పారని అన్నారు. తనతో కలసి పని చేసే వారి మాటలను కూడా మోదీ పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా రాహుల్ సూచించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలపై విమర్శలు కురిపించిన రాహుల్, మేకిన్ ఇండియా పథకం బడా వ్యాపారులకే వర్తిస్తుందని, ‘స్వచ్ఛభారత్’ పథకం తీసుకురావడం బాగుందని ప్రశంసించారు.