: భారత్-జపాన్ బంధం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బంధం: జపాన్ ప్రధాని షింజో అబె
జపాన్ ప్రధాని షింజో అబె భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు భారత ప్రధాని మోదీతో కలిసి షింజో అబె గుజరాత్‌లోని అహ్మదాబాద్ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షింజో మాట్లాడుతూ... భారత్‌కు, తమ దేశానికి మధ్య ఉన్న బంధం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బంధమని వ్యాఖ్యానించారు. భారత్‌తో ఆర్థిక, వ్యాపార బంధాలను మరింత పెంచుకునేందుకు తాము ఆసక్తిని చూపుతున్నట్లు తెలిపారు.
అందుకే భారత్‌లో బుల్లెట్ ట్రయిన్ ఏర్పాటు చేసేందుకు ఆర్థిక, సాంకేతిక సాయాన్ని ఇస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఆర్థిక వృద్ధి రేటును గణనీయంగా సాధిస్తోన్న భారత్‌కు హై స్పీడ్ రైళ్ల సాంకేతికను భవిష్యత్తులో కూడా అందిస్తామని తెలిపారు. తమ వద్ద పటిష్టమైన సాంకేతికత, వాటిని నిర్వహించే సంస్థలున్నాయని జపాన్ ప్రధాని అన్నారు. భారత్‌లో తిరుగులేని మానవ వనరులు ఉన్నాయని చెప్పారు. దీంతో ఈ రెండింటిని కలిపితే ప్రపంచంలో ఇరు దేశాలు తిరుగులేని విజయాలను సాధిస్తాయని చెప్పారు.
భారత్-జపాన్‌ల మధ్య బంధం పరస్పర నమ్మకం మీద ఏర్పడిందని ఆ దేశ ప్రధాని అన్నారు. భారత సినీ నటులకు తమ దేశంలో మంచి ఆదరణ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఇరు దేశాలు ఇండో పసిఫిక్ రీజియన్‌లో శాంతి కోసం కృషి చేస్తున్నాయని తెలిపారు.