: హాజరు తీసుకునేటప్పుడు `ఎస్ సర్` కాదు.... జైహింద్ అనండి... మధ్యప్రదేశ్ విద్యాశాఖ ఉత్తర్వులు
విద్యార్థుల్లో జాతీయత, దేశాభిమాన భావాలను పెంపొందించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో తరగతిలో హాజరు తీసుకునేటప్పుడు `ఎస్ సర్`, `ఎస్ మేడం`లకు బదులుగా `జై హింద్` అనాలని ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి విజయ్ షా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని మొదట సత్నా జిల్లాలో అక్టోబర్ 1న ప్రవేశపెట్టనున్నారు. తర్వాత నవంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో అమలు చేసేందుకు చొరవ తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
`దేశ సంస్కృతి గురించి అవగాహన కోల్పోతున్న నేటి విద్యార్థుల్లో దేశాభిమానాన్ని పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. `జై హింద్` అని పలకడం అన్ని మతాల వారికి సమంజసంగా ఉంటుంది` అని విజయ్ షా చెప్పారు. అయితే ఇలాంటి విషయాలపై కాకుండా ప్రభుత్వం విద్యా నైపుణ్యాలను పెంచే అంశాలపై దృష్టి పెడితే బాగుంటుందని కొంతమంది విద్యానిపుణులు, ప్రతిపక్ష పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.