: త్వరలో మార్కెట్‌లోకి రూ. 100 నాణేలు... ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ
త్వరలో రూ.100 నాణేలను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఎంజీ రామచంద్రన్, ఎంఎస్ సుబ్బులక్ష్మిల జ్ఞాపకార్థం వారి 100వ జన్మదినం సందర్భంగా రూ. 100, రూ. 5, రూ. 10 నాణేలను ముద్రిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. రూ. 100 నాణెం వ్యాసం 44 మిల్లీమీటర్లుగా ఉంటుందని తెలిపింది. అలాగే నాలుగు సింహాల అశోకుని స్థూపం బొమ్మ కూడా నాణెం మీద ముద్రించనున్నట్లు చెప్పింది.
కొన్ని నాణేలను ఎంజీఆర్ బొమ్మతోను, మరికొన్నింటి వెనుక భాగంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి బొమ్మను ముద్రిస్తామని తెలిపింది. ఒక్కొక్కటి 35 గ్రాముల బరువుండే ఈ నాణేన్ని తయారు చేయడానికి వెండి, రాగి, నికెల్, జింక్‌ల మిశ్రమాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే రూ. 10 నాణెం మీద సుబ్బులక్ష్మి బొమ్మను, రూ. 5 నాణెం మీద ఎంజీఆర్ బొమ్మను ముద్రిస్తామని వివరించింది.