: 2018 పద్మ అవార్డులకు ఇప్పటివరకు 15,706 నామినేషన్లు.. సెప్టెంబర్ 15 చివరి తేదీ!
దేశంలో ప్రతిష్టాత్మక అవార్డులైన పద్మ అవార్డుల కోసం ఈ ఏడాది ఇప్పటివరకు 15,706 నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15తో ఈ నామినేషన్ల గడువు ముగియనున్నట్లు హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. గతేడాది పద్మ అవార్డుల కోసం 18,768 నామినేషన్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డులకోసం భారతీయ పౌరులు ఎవరైనా, ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన వారిని ఆన్‌లైన్ ద్వారా నామినేట్ చేయవచ్చు.
గతంలో మంత్రులు, రాజకీయ నాయకులకు మాత్రమే పద్మ అవార్డులకు వివిధ రంగాల వారిని నామినేట్ చేసే అవకాశం ఉండేది. అలా కాకుండా దేశ ప్రజలందరికీ నామినేట్ చేసే హక్కును తమ ప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నామినేషన్లను ప్రధాని నియమించిన పద్మ అవార్డుల కమిటీ విశ్లేషించి విజేతలను ఎంపిక చేస్తుంది. విజేతలందరికీ గణతంత్ర దినోత్సవం రోజున అవార్డులను అందజేస్తారు.