: చెత్తకుండీతో సెల్ఫీ దిగండి... స్మార్ట్‌ఫోన్ గెలవండి... జంషెడ్పూర్ మున్సిపాలిటీ వినూత్న యత్నం
యువతలో స్వచ్ఛ భారత్ గురించి అవగాహన పెంచేందుకు జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన మాంగో నోటిఫైడ్ ఏరియా కమిటీ వారు వినూత్న యత్నాన్ని ఎంచుకున్నారు. సెల్ఫీ పిచ్చిలో పడి ఊగుతున్న యువతను దాని సహాయంతోనే స్వచ్ఛ భారత్ వైపు మళ్లించేందుకు వారు ఓ పోటీని ప్రారంభించారు. నోటిఫైడ్ ఏరియా పరిధిలో ఉన్న చెత్తకుండీల దగ్గర సెల్ఫీ దిగి పంపించమని వారు కోరుతున్నారు. వచ్చిన సెల్ఫీ ఎంట్రీలలో ఉత్తమ సెల్ఫీకి అక్టోబర్ 2న స్వచ్ఛ దివస్ సందర్భంగా కార్యక్రమం నిర్వహించి స్మార్ట్‌ఫోన్ బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు. సెల్ఫీలు పంపించడానికి వారు ప్రత్యేకంగా ఫేస్బుక్ పేజీని సృష్టించారు. గతంలో కూడా మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కల్పించేందుకు కూడా ఇలాంటి సెల్ఫీ పోటీనే జార్ఖండ్ మున్సిపాలిటీలు నిర్వహించాయి.