: శశికళను బహిష్కరించడమే లక్ష్యంగా మొదలైన అన్నాడీఎంకే చర్చ
చెన్నై సమీపంలోని వానగరంలో అన్నాడీఎంకే కీలక సర్వసభ్య సమావేశం కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభం కాగానే, పార్టీ నుంచి శశికళతో పాటు ఆమె బంధువు దినకరన్ ను సాగనంపే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, దానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు విలీనమైన తరువాత తొలిసారిగా సర్వసభ్య సమావేశం జరుగుతుండగా, దినకరన్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి గైర్హాజరయ్యారు.
కొద్దిసేపట్లో శశికళను, దినకరన్ ను పార్టీ సభ్యత్వం నుంచి పదవుల నుంచి బర్తరఫ్ చేస్తూ, నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. అదే జరిగితే ఏం చేయాలన్న విషయమై దినకరన్ వర్గం సైతం మంతనాలు సాగిస్తోంది. తామంతా మూకుమ్మడి రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని పడదోస్తామని కొందరు దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నా, ఎంతమంది ఈ నిర్ణయాన్ని సమర్థిస్తారన్న విషయంలో మాత్రం అనుమానాలున్నాయి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టి, అధికారాన్ని కోల్పోయి మరోమారు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం చేసేందుకు దినకర్ వర్గంలోని అత్యధికులు సిద్ధంగా లేరని సమాచారం.