: ఉత్తరకొరియాకు చెలగాటం.. చైనాకు ప్రాణసంకటం!
అమెరికాపై కక్షతో ఉత్తరకొరియా చేపడుతున్న చర్యలు చైనాకు ప్రాణసంకటంగా మారుతున్నాయి. ఇంతవరకు క్షిపణి పరీక్షలు నిర్వహించడం ద్వారా శత్రుదేశాలను భయపెట్టిన ఉత్తరకొరియా, హైడ్రోజన్ బాంబు పరీక్షతో ఏకైక మిత్రదేశం చైనాకు చిక్కులు తెచ్చింది. ఉత్తరకొరియాకు చైనా ఆర్థిక సాయం అందిస్తుందన్నది బహిరంగ రహస్యమే. దీనిని నిర్ధారిస్తూ, ఉత్తరకొరియాతో తమకు విడదీయరాని అనుబంధం ఉందని కూడా ఇటీవల చైనా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా పుంగె-రి కొండల్లోని సొరంగంలో నిర్వహించిన హైడ్రోజన్ బాంబు పరీక్ష ఫలితంగా ఆ సొరంగం కూలిపోయి, కొండ బీటలువారింది. అయితే ఈ పేలుడు కారణంగా సంభవించిన రేడియోధార్మిక వ్యర్థాలు వాతావరణంలో కలుస్తున్నాయని చైనా తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇవి చైనా వైపు రావడం ఖాయమని వారు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాంతంలో ఉత్తరకొరియా మరొక అణుపరీక్ష నిర్వహిస్తే, ఉత్తరకొరియాతో పాటు చైనాలో కూడా అంతుబట్టని వ్యాధులతో ప్రజలు మరణించే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన రాన్డ్ కార్పొరేషన్ అనే రక్షణ వ్యవహారాల విశ్లేషణా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ ప్రాంతంలో మరో అణు పరీక్షలు నిర్వహించరన్న గ్యారెంటీ లేదని వారు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే రేడియో ధార్మిక వ్యర్థాలు ఎప్పుడు తమ వాతావరణ పరిధిలో అడుగుపెడతాయోనని ఆందోళణ చెందుతున్న చైనా, అమెరికా రాన్డే కార్పొరేషన్ ప్రకటనతో ఆందోళన చెందుతోంది. ఈ సారి అదే ప్రాంతంలో అలాంటి పరీక్షలు జరిగితే ఉత్తరకొరియాతో పాటు చైనాకు కూడా ముప్పుతప్పదని చైనా శాస్త్రవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాపై కసితో ఉత్తరకొరియా చేష్టలు ఆ దేశానికి చెలగాటం, చైనాకి ప్రాణ సంకటంలా మారాయి.