: భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన మహిళ.. పది నెలల తరువాత గుడి మెట్ల వద్ద కనిపించిన భర్త!
భర్త అంత్యక్రియలు నిర్వహించిన పది నెలల తరువాత ఓ గుడి వద్ద మెట్ల మీద భర్త కనిపించడంతో పట్టరాని సంతోషంతో అతనిని భార్య ఆలింగనం చేసుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఘటన వివారాల్లోకి వెళ్తే... కేరళకు చెందిన రాజేశ్వరి (54), కృష్ణన్ కుట్టి (55) దంపతుల మధ్య ప్రతి కుటుంబంలో ఉన్నట్టే చిన్నచిన్న వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత నవంబర్ 13న భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అలకబూనిన కృష్ణన్ కుట్టి ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో రాజేశ్వరి అతని కోసం గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొన్ని నెలల తరువాత తమిళనాడులోని కొయంబత్తూరు పోలీసులు ఆమెకు ఫోన్ చేసి, కృష్ణ చంద్రన్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఉన్నారని చెబుతూ, ఒక ఫోటోను ఆమెకు చూపించారు. దానిని ఆమె సరిగ్గా గుర్తుపట్టలేకపోయారు. దీంతో ఆ వ్యక్తి మృతి చెందాడంటూ వారం తరువాత పోలీసులు ఆమె బంధువులకు సమాచారం అందించారు. దీంతో ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
భర్త పోయాడన్న బాధతో ఆమె కుంగిపోసాగింది. దీంతో ఆమె బంధువులు ఏదైనా గుడికి వెళ్లమని ఆమెకు సలహా ఇచ్చారు. దీంతో ఆమె తమిళనాడులోని పళనిస్వామి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని, తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలో ఆ గుడి మెట్ల వద్ద ఆమె భర్త కనిపించారు. దీంతో ఆనందం పట్టలేకపోయిన ఆమె గట్టిగా కేకలు వేస్తూ ఆయనను గుండెలకు హత్తుకుంది. దీంతో విషయం అర్ధంకాని భక్తులు ఆయోమయంగా చూడగా, తమ గాథను వారికి ఆమె వివరించింది. అనంతరం ఊరెళ్లి, గతంలో అంత్యక్రియలు నిర్వహించిన వ్యక్తి వివరాలు ఆరాతీస్తున్నారు.