: ముస్తాబైన స్టీవ్ జాబ్స్ థియేటర్, ఐఫోన్ 8 విడుదల నేడే... విశేషాలివి!
యాపిల్ మెగా ఈవెంట్ కు సర్వం సిద్ధమైంది. నేడు కాలిఫోర్నియాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలోని స్టీవ్ జాబ్స్ థియేటర్ లో కళ్లు చెరిరే లైటింగ్, సాంస్కృతికోత్సవాల మధ్య యాపిల్ నూతనంగా తయారు చేసిన ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ లు మార్కెట్లోకి రానున్నాయి. యాపిల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఫోన్లు విడుదల కానుండగా, ఫోన్ స్పెసిఫికేషన్స్ పై ఎన్నో లీక్ లు వస్తున్నాయి. ఓఎన్ఈడీ మోడల్ డిస్ ప్లేలో ఈ స్మార్ట్ ఫోన్ ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ మూడు గాడ్జెట్లలో 3 జీబీ ర్యామ్ ఉంటుందని, ఐఫోన్ ఎక్స్ లో 12 ఎంపీ రేర్ కెమెరా, 60 ఎఫ్పీఎస్ తో 4కే వీడియో సపోర్ట్ ఉంటుందని తెలుస్తోంది. ముందువైపు 7 ఎంపీ కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. యాపిల్ ఆపరేటింగ్ వ్యవస్థల్లో 11వ అప్ డేట్ అయిన జీఎం (గోల్డెన్ మాస్టర్) సిస్టమ్ ఆధారంగా ఇవి పని చేస్తాయని, సంస్థ స్వయంగా తయారు చేసుకున్న 6 కోర్ ఏ-11 ప్రాసెసర్ తో ఇవి లభిస్తాయని తెలుస్తోంది.
3డీ ఫేస్ రికగ్నిషన్ ఆప్షన్ తో పాటు వైర్ లెస్ చార్జింగ్ ఫెసిలిటీ అదనపు ఆకర్షణలని తెలుస్తోంది. ఐఫోన్ 8 ధర 1000 డాలర్ల వరకూ ఉంటుందని అంచనా. ఇక ఈ ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్స్, కచ్చితమైన ధర వివరాలు తెలియాలంటే కొన్ని గంటలు ఆగక తప్పదు.