: ఢిల్లీలో దారుణం.. ఇంగ్లిష్‌లో చక్కగా మాట్లాడాడని యువకుడిని చితగ్గొట్టారు.. ముగ్గురి అరెస్ట్!
స్నేహితుడితో ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడిన 22 ఏళ్ల యువకుడిని ఐదుగురు వ్యక్తులు అతడిపై దాడిచేసి చితకబాదారు. ఢిల్లీలో జరిగిందీ ఘటన. శనివారం ఈ ఘటన జరగ్గా యువకుడిపై దాడిచేసిన నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కన్నాట్ ప్లేస్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ వద్ద స్నేహితుడు దక్ష్‌ను దిగబెట్టిన గులాటి అతడితో కాసేపు ఇంగ్లిష్‌లో మాట్లాడి తిరిగి బయలుదేరాడు.
ఇది చూసిన ఐదుగురు వ్యక్తులు ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడినందుకు అతడితో వాగ్వాదానికి దిగారు. ఇంగ్లిష్ ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నించారు. అతడిని రౌండప్ చేసి దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం ఓ వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. అయితే వాహనం నంబరును గుర్తుపెట్టుకున్న గులాటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నంబరు ఆధారంగా నిందితులను గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.