: 49 వేల మంది ఆధార్ ఆపరేట్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన కేంద్రం!
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లపై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కొరడా ఝళిపించింది. ఆధార్ సేవలు అందించేందుకు ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాలు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణలపై స్పందించిన అధికారులు తనిఖీల్లో ఈ విషయాన్ని నిర్ధారించారు. దీంతో ఏకంగా 49 ఆపరేట్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. ఆధార్ సెంటర్లలో అవినీతికి సంబంధించి తమకు పలు ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. ఆధార్ సేవలు అందించే విషయంలో ఎవరైనా అవినీతికి పాల్పడినట్టు తేలితే వారిని ఐదేళ్లపాటు బ్లాక్ లిస్ట్‌లో పెడతామని ఈ సందర్బంగా హెచ్చరించారు.
డిసెంబరు 2016 నాటికి 6100 మంది ఆపరేటర్లకు ఒక్కొక్కరికీ రూ.10 చొప్పున జరిమానా విధించినట్టు తెలిపారు. అలాగే జూలై 2017 నుంచి ఇప్పటి వరకు అక్రమాలకు పాల్పడిన 466 మందిపై ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున జరిమానా విధించినట్టు అధికారులు వివరించారు. ఆధార్ సెంటర్లలో ఎక్కడైనా అవినీతి జరుగుతున్నట్టు గుర్తిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.