: హార్వీ, ఇర్మా తుపానుల నష్టం.. 12.8 లక్షల కోట్ల రూపాయలు: 'మూడీస్' అంచనా
అమెరికాను వరుసగా రెండు తుపానులు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. టెక్సాస్ ను హార్వీ హరికేన్ ఇబ్బందులపాలు చేస్తే, ఫ్లోరిడాను ఇర్మా ఇక్కట్లలోకి నెట్టింది. ఈ హరికేన్ ల నేపథ్యంలో అమెరికాకు మొత్తం 150 నుంచి 200 బిలియన్ డాలర్ల (9.6 నుంచి 12.8 లక్షల కోట్ల రూపాయల) నష్టం వాటిల్లిందని మూడీస్ సంస్థ ఆర్థిక విశ్లేషకుడు మార్క్ జందీ ప్రాథమిక అంచనా వేశారు. దీనిపై పూర్తి వివరాలు అందుబాటులోకి వచ్చిన అనంతరం ఈ సంఖ్య మారవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుత వివరాల ప్రకారం 200 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.
ఈ హరికేన్ల కారణంగా అమెరికా ఉత్పత్తి రంగం తీవ్ర ఒడిదుడుకులకు గురైందని ఆయన చెప్పారు. ఆ రంగం సుమారు 20 నుంచి 30 బిలియన్ డాలర్లు నష్టపోయిందని ఆయన చెప్పారు. ఈ రెండు తుపానుల నష్టం కత్రినా హరికేన్ తో సంభవించిన నష్టంతో సమానమని ఆయన అంచనా వేశారు. కేవలం ఇర్మా తుపాను కలిగించిన నష్టం 64 నుంచి 92 బిలియన్ డాలర్లు (4 నుంచి 5.9 లక్షల కోట్ల రూపాయలు) ఉంటుందని ఆర్థిక గణాంక సంస్థ మూడీస్ నిర్ధారించింది.