: విపరీతంగా ఆస్తులు పెంచుకున్న ఆ ఏడుగురు ఎంపీలు, 98 మంది ఎమ్మెల్యేలపై దర్యాప్తు జరపండి: సుప్రీంకోర్టు ఆదేశం
భారీగా ఆస్తులను పెంచుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ఎంపీలు, 98 మంది ఎమ్మెల్యేలపై వెంటనే దర్యాప్తు జరపాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే వీరిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రాథమిక దర్యాప్తు జరిపి... ఆస్తులను గణనీయంగా పెంచుకున్నట్టు తేల్చారని సుప్రీం తెలిపింది. సుప్రీంకోర్టు సూచనలకు బదులుగా... సీల్డ్ కవర్ లో జాబితా అందిన వెంటనే దర్యాప్తును ప్రారంభిస్తామని, వీలైనంత త్వరగా దర్యాప్తును ముగిస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ తెలిపింది.
'లోక్ ప్రహరి' అనే ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ... ప్రజాప్రతినిధుల ఆస్తులు విపరీతంగా పెరిగిపోతున్నాయంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచిన అంశాలను కోర్టుకు నివేదిస్తూ... విపరీతంగా పెరిగిపోయిన ఆస్తులపై దర్యాప్తు జరపాలని కోరింది. ఈ సందర్భంగా 26 మంది లోక్ సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 257 మంది ఎమ్మెల్యేల పేర్లను సుప్రీంకోర్టుకు అందజేసింది.