: ఇండియాలో తమ రూ. లక్ష కోట్ల ప్రాజెక్టుకు సలహాదారుగా ఐఐటీయన్ సంజీవ్ సిన్హాను నియమించుకున్న జపాన్


రూ. లక్ష కోట్ల అంచనా వ్యయంతో అహ్మదాబాద్ - ముంబై మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ ను నిర్మించ తలపెట్టిన జపాన్, అందుకు సలహాదారుగా కాన్పూర్ ఐఐటీయన్ సంజీవ్ సిన్హాను నియమించుకుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో అత్యధిక భాగాన్ని జపాన్ తక్కువ వడ్డీకి రుణంగా అందించనున్న సంగతి తెలిసిందే. జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే ట్రాక్ నిర్మితం కానుండగా, ఈ నెల రెండో వారంలో భారత్ పర్యటనకు వచ్చే జపాన్ ప్రధాని షింజో అబే సమక్షంలో 14న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. తన నియామకంపై స్పందించిన సిన్హా, రెండు దేశాల ప్రభుత్వాల మధ్యా తాను సంధానకర్తగా వ్యవహరించనున్నానని తెలిపారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశం తనకు లభించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ఎంతో సవాలని అన్నారు.

"కేవలం 0.1 శాతం వడ్డీ రేటుతో ఈ ప్రాజెక్టుకు జపాన్ రుణాన్ని అందిస్తోంది. ప్రాజెక్టు పూర్తయిన తరువాత 15 సంవత్సరాల వరకూ చెల్లింపు చేయనక్కర్లేదు. ఆపై మరో 35 సంవత్సరాల్లోగా తీసుకున్న రుణాన్ని తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. జపాన్ లో షికన్సేన్ అనే పేరిట హై స్పీడ్ రైలుంది. అదే తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ వాడనున్నాం. ప్రాజెక్టు పూర్తయితే, రెండు నగరాల మధ్యా ప్రయాణ సమయం ఎంతో తగ్గుతుంది" అని ఆయన అన్నారు. కాగా, కాన్పూర్ ఐఐటీలో విద్యను అభ్యసించిన రాజస్థాన్ బామర్ ప్రాంతానికి చెందిన సిన్హా, గత 21 సంవత్సరాలుగా జపాన్ లోనే ఉంటున్నారు. గతంలో గోల్డ్ మన్ సాక్స్, మిజుహో సెక్యూరిటీస్, యూబీఎస్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ తదితర సంస్థల్లో విధులు నిర్వర్తించారు. టాటా అసెట్ మేనేజ్ మెంట్, టాటా రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు జపాన్ లో చీఫ్ కంట్రీ రిప్రజంటేటివ్ గానూ పని చేశారు.

  • Loading...

More Telugu News