: చంపేస్తామంటున్నారు... నన్ను కాపాడండి: పోలీసులను కోరిన కంచ ఐలయ్య
తాను గతంలో ఎన్నడో రాసిన పుస్తకాన్ని ఇప్పుడు వెలుగులోకి తెచ్చి వివాదం చేయడంతో పాటు, తనను హత్య చేస్తామని బెదిరిస్తున్నారని, తన ప్రాణాలను కాపాడాలని సామాజిక రచయిత, బడుగు సంఘాల నేత కంచ ఐలయ్య పోలీసులను కోరారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన, కొందరు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
ఫోన్ చేసిన వారి నంబర్లను పోలీసులకు ఇచ్చిన ఆయన, వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, కర్నూలు, అనంతపురం తదితర ప్రాంతాల్లో ఐలయ్యపై వైశ్య సంఘాలు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టాయి. తమను కించపరిచేలా పుస్తకం రాసిన ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని, పుస్తకాన్ని నిషేధించాలని వారు కోరారు. ఆయన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి వ్యవస్థాపకుడు టీజీ భరత్ డిమాండ్ చేశారు.