: ఆయుధాలు లేవనడం సరికాదు... ఇండియా వద్ద పుష్కలంగా మందుగుండు: నిర్మలా సీతారామన్
ఏ దేశంతోనైనా యుద్ధం చేయాల్సి వస్తే కనీసం 20 రోజుల పాటు పోరాడేందుకు అవసరమైన మందుగుండు సామాగ్రి, ఆయుధాలు ఇండియా వద్ద లేవని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇటీవల పార్లమెంట్ కు సమర్పించిన నివేదికపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ నివేదికను తోసిపుచ్చిన ఆమె, ఆయుధాలు లేవనడం సరికాదని, రక్షణ దళాలకు సరిపడా మందుగుండు నిల్వలున్నాయని మీడియాకు తెలిపారు.
కాగ్ నివేదికపై తాను సీనియర్ అధికారులతో మాట్లాడానని వెల్లడించిన ఆమె, త్వరలో మరిన్ని అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేయనున్నామని, ఇది నిరంతర ప్రక్రియని అన్నారు. కనీసం 40 రోజుల పాటు యుద్ధం చేసేందుకు సరిపడా మందుగుండు కావాల్సి వుండగా, అందులో సగమైనా మన సైన్యం వద్ద లేదని కాగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రభుత్వ రంగ ఓఎఫ్బీ (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు)దే బాధ్యతని, మార్చి 2013 నుంచి సరిపడా మందుగుండును ఆ సంస్థ అందించడం లేదని కాగ్ పేర్కొంది. దేశ భద్రతా దళాల సామర్థ్యం, అందుబాటులోని ఆయుధాలపై ఎవరికీ ఎటువంటి అనుమానాలూ అక్కర్లేదని, ఇటీవలే రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ తెలిపారు.