: ఫేస్‌బుక్‌లో నకిలీ లైకులు సాధ్యమే... ప్రమాదం ఉందంటున్న శాస్త్రవేత్తలు
ఈ మధ్య సోషల్ మీడియా ప్రచారం కోసం లైకుల సంఖ్యను ఓ పరిమాణంగా తీసుకుంటున్నాయి కార్పొరేట్ వర్గాలు. ఈ నేపథ్యంలోనే నకిలీ లైకులు కూడా తెచ్చుకునేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. అయితే ఫేస్‌బుక్ రక్షణ విధానాల్లో ఉన్న కొన్ని లోపాల వల్ల పెట్టిన పోస్టులకు కావాల్సినన్ని లైకులు, కామెంట్లు తెచ్చుకునే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని ఇయోవా యూనివర్సిటీ, పాకిస్థాన్‌లోని లాహోర్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇలా నకిలీ లైకులు సృష్టించగల కొన్ని వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయని వారు పేర్కొన్నారు. అయితే వారికి ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించిన అన్ని అనుమతులను ఇవ్వాల్సి ఉంటుందని వారు తెలియజేశారు. అధిక లైకులు ఉన్న పోస్టులపై సోషల్ మీడియాలో ఎక్కువ ప్రాచుర్యం పొందుతాయి. అందుకే లైకుల మోజులో పడి ఈ వెబ్‌సైట్లను ఆశ్రయించేవారు చాలామంది ఉన్నారు. అలా చేయడం వల్ల ఫేస్‌బుక్‌లో పొందుపరిచిన వ్యక్తిగత వివరాలను అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.