: అమెరికా ప్రధాన భూభాగంలో మా న్యూక్లియర్ మిస్సైల్ పడితీరుతుంది!: ఉత్తరకొరియా విదేశాంగ శాఖ మంత్రి
అమెరికాపై కసితో తమ సైనికులు, రక్షణ శాఖ నిపుణులు కలిసి పని చేస్తున్నారని ఉత్తరకొరియా విదేశాంగ శాఖ మంత్రి చోయ్ హూన్ చోలై తెలిపారు. ఉత్తరకొరియా అధికారిక మీడియాతో ఆయన మాట్లాడుతూ, అమెరికా ప్రధాన భూభాగంలో ఉత్తరకొరియా న్యూక్లియర్ మిస్సైల్ పడుతుందని అన్నారు. ట్రంప్ బెదిరింపులు లేదా ఐక్యరాజ్యసమితి ఆంక్షలు తమను ఏమీ చేయలేవని ఆయన స్పష్టం చేశారు. అమెరికా కుయుక్తులను ఉత్తరకొరియా పసిగట్టిందని ఆయన చెప్పారు.
ప్రపంచ దేశాల ముందు ఉత్తరకొరియాను దోషిని చేసి నిలబెట్టాలనదే అమెరికా ప్రయత్నమని ఆయన విమర్శించారు. ఏదో ఒకరోజు తప్పకుండా ఉత్తరకొరియా న్యూక్లియర్ మిస్సైల్ అమెరికా ప్రధాన భూభాగంలో పడితీరుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ దేశం అంత్యంత బలమైన అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశమని ఆయన తెలిపారు. తమ దగ్గరున్న ఆయుధాలు అమెరికా దగ్గరున్న ఆయుధాల కంటే ఎంతో శక్తిమంతమైనవని ఆయన వెల్లడించారు. అమెరికా వేసే ప్రతి అడుగును తమ నిఘా వ్యవస్థ నిశితంగా గమనిస్తోందని ఆయన అన్నారు.