: చాలాకాలం తరువాత కశ్మీర్లో సైన్యానికి ప్రాణాలతో పట్టుబడిన ఉగ్రవాది!
ఉగ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉండే జమ్మూ కశ్మీర్ లో ఏదైనా ఎన్ కౌంటర్ జరిగితే, ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడటం అన్నది అత్యంత అరుదు. చావుకు తెగించి తమపై కాల్పులకు తెగబడే వారిని మట్టుబెట్టడమే భద్రతా దళాల ముందుండే ఆప్షన్. కానీ, అందుకు విరుద్ధంగా ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు జమ్మూ కశ్మీర్ పరిధిలోని పోషియాన్ సమీపంలో ఎన్ కౌంటర్ ను ప్రారంభించగా, ఓ ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు.
ఇటీవలే హిజ్బుల్ ముజాహిద్దీన్ లో చేరిన ఆదిల్ అనే యువకుడు, బార్బుగ్ అనే గ్రామంలో మరో ఉగ్రవాది తారిక్ అహ్మద్ తో కలసి ఉన్నాడని తెలుసుకున్న సైన్యం, గాలింపు చేపట్టిన వేళ ఈ ఘటన జరిగింది. తారిక్ అహ్మద్ ను హతమార్చిన సైన్యం, ఆదిల్ ను మాత్రం ప్రాణాలతో పట్టుకుంది. ఇటీవలి కాలంలో ఎన్ కౌంటర్ జరిగి ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడటం ఇదే తొలిసారి.