: తెలంగాణ పర్యటనకు వచ్చిన బీహార్ డిప్యూటీ సీఎం
తెలంగాణలో పర్యటించే నిమిత్తం బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ హైదరాబాద్ కు వచ్చారు. తన పర్యటనలో భాగంగా నేడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు వెళ్లనున్న ఆయన, కోమటిబండ గ్రామంలో జరుగుతున్న మిషన్ భగీరథ పథకం తీరుతెన్నులను పరిశీలించనున్నట్టు అధికారులు తెలిపారు. బీహార్ లో మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తున్న నితీశ్ కుమార్ సూచనల మేరకు ప్రాజెక్టు చేపట్టిన విధానంపై అవగాహన కోసం వచ్చారు. ఆపై గజ్వేల్ లో ఎడ్యుకేషనల్ హబ్ ను కూడా మోదీ పరిశీలిస్తారు. ఆ తరువాత మర్కుక్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామాన్ని ఆయన పర్యటిస్తారని, ఆపై తిరిగి పాట్నా బయలుదేరుతారని సమాచారం.