: కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ ఇంటిపై సీబీఐ దాడులు


తాను మంత్రిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహించింది. ఆమె పర్యావరణ శాఖ బాధ్యతలను నిర్వహించిన వేళ, 2012లో జార్ఖండ్ లో ఓ మైనింగ్ ప్రాజెక్టుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని, అటవీ భూములను అప్పనంగా కట్టబెట్టారన్న ఆరోపణలపై సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో 2011 నుంచి 2013 వరకూ ఆమె మంత్రి బాధ్యతలు నిర్వహించారు.

ఆ సమయంలో మొత్తం 55.79 హెక్టార్ల అటవీ భూమిని ఆమె ఓ గనుల ప్రాజెక్టుకు కేటాయించారని, అందుకోసం డబ్బు తీసుకున్నారని సీబీఐ కేసు నమోదు చేసింది. కేసు విచారణలో భాగంగా చెన్నైలోని ఆమె ఇంటిపై దాడులు జరిపిన అధికారులు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, సుమారు మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ తో కలిసున్న ఆమె, 2015లో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేసి పార్టీకి రాజీనామా చేశారు. కాగా, జయంతి ఇచ్చిన భూముల నోటిఫికేషన్ ను ఆమె తరువాత అదే శాఖ బాధ్యతలు చేపట్టిన జైరాం రమేష్ రద్దు చేసిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News