: మొదలైన 'ఇర్మా' ప్రభావం... ఫ్లోరిడాలో ఇదీ పరిస్థితి!
ఇర్మా హరికేన్ తరుముకొచ్చింది. మహోత్పాతం సృష్టించి, సుమారు కోటి మందిపై ప్రభావం చూపుతుందని భావిస్తున్న తుపాను ప్రభావం ఫ్లోరిడా తీరం వద్ద కనిపిస్తోంది. ఇప్పటివరకూ 50 లక్షల మందిని ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ, లక్షలాది మంది ఎటూ కదలక తమ ఇళ్లలోనే ఉండిపోయారు. ప్రస్తుతం తీరం వెంబడి 250 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వేలాది మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నిలువెత్తులో అలలు ఎగసి పడుతున్నాయి.
ప్రస్తుతమున్న 260 పునరావాస కేంద్రాలకు అదనంగా యుద్ధ ప్రాతిపదికన మరో 70 షెల్టర్లు ఏర్పాటు చేసే పనిలో అధికారులు ఉన్నారు. తీరానికి దూరంగా వెళ్లిపోవాలని భావిస్తున్న వారి వాహనాలతో జాతీయ రహదారులు కిక్కిరిసిపోగా, వాహనాలు నిదానంగా సాగుతున్నాయి. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వివరిస్తున్నారు అధికారులు. ఇది అత్యంత విధ్వంసకరమైన తుపాను కానుందని, అధికారులు చెప్పిన విధంగా ప్రజలు నడుచుకోవాలని ఆయన ఓ వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు.