: నిన్న పాకిస్థాన్ కి... నేడు చైనాకి షాకిచ్చిన అమెరికా!
40 ఏళ్లుగా అమెరికాలోని న్యూయార్క్ లో సేవలందిస్తున్న పాకిస్థాన్ బ్యాంక్ పై అమెరికా ఫైనాన్షియల్ సంస్థ ఉక్కుపాదం మోపి దానిని నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి షాకే చైనాకు కూడా ఇచ్చింది. చైనా కంపెనీలు మనీ లాండరింగ్ కు పాల్పడుతూ ఉత్తరకొరియాకు లాభం చేకూర్చుతున్నాయని అమెరికా ఆరోపించింది. అలాంటి కంపెనీలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. నిషేధం విధించడమే కాకుండా ఆ కంపెనీలకు సంబంధించి అమెరికాలో ఉన్న ఆస్తులను సీజ్ చేసింది.
ప్రధానంగా చైనాకు చెందిన జడ్ టీఈ కార్పొరేషన్ సంస్థ ఉత్తరకొరియాకు అక్రమంగా మనీ చేరవేస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆధారాలు సేకరించిన అధికారులు, కంపెనీని సీజ్ చేశారు. ఇలాంటి చర్యల్లో మరికొన్ని చైనా కంపెనీలు భాగమయ్యాయని, త్వరలోనే వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైనా కంపెనీలు అమెరికా గడ్డపై వ్యాపారాలు చేస్తూ ఉత్తరకొరియాకు లాభం చేకూర్చడం ఎంతమాత్రం హర్షణీయం కాదని, అందుకే చర్యలు తీసుకుంటున్నామని అమెరికా స్పష్టం చేసింది. తాజాగా చైనా కంపెనీలపై చర్యలు తీసుకోవడం ద్వారా ఆ దేశంపై ఒత్తిడి పెంచి ఉత్తరకొరియాను కట్టడి చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.