: ప్రముఖ కన్నడ సినీ నటుడు సుదర్శన్ మృతి!
కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ కన్నడ నటుడు ఆర్ఎన్ సుదర్శన్ (78) మృతి చెందారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఆయన కుటుంబసభ్యులు పేర్కొన్నారు. సుదర్శన్ మృతిపై కన్నడ చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది. కాగా, కన్నడ, తమిళ, తెలుగు భాషా చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ సుదర్శన్ నటించారు. 2010లో హీరో ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన 'సూపర్' చిత్రంలో ఆయన చివరిసారిగా నటించారు. సుదర్శన్ భార్య శైలజ కూడా నటి. ఇదిలా ఉండగా, సుదర్శన్ మృతిపై ప్రముఖ నటి రాధిక తన సంతాపం తెలిపింది. సుదర్శన్ తో కలసి పలు చిత్రాల్లో నటించానని, ఆయనతో, భార్య శైలజతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని రాధిక తన ట్వీట్ లో పేర్కొంది.