: విమానం ఎక్కాలంటే ప్రవర్తన బాగుండాల్సిందే.. లేదంటే ఈ విధంగా నిషేధం పడుద్ది!: పౌర విమానయాన శాఖ ప్రకటన


విమానాల్లో ప్ర‌యాణించాలంటే ప్రయాణికుల ప్రవర్తన బాగుండాల్సిందేన‌ని పౌర విమానయాన శాఖ స్ప‌ష్టం చేసింది. ప్రయాణికుల ప్రవర్తన బాగోలేకపోతే నిషేధం ఎదుర్కోక తప్పదని చెప్పింది. ఇందుకు సంబంధించి ప్ర‌యాణికుల ప్ర‌వ‌ర్త‌నను మూడు స్థాయిలుగా పేర్కొని, మూడు నెలల నుంచి గరిష్ఠంగా జీవితకాలం పాటు సదరు ప్రయాణికులపై నిషేధం వేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. విమానాశ్ర‌యాల్లో దూషించడం, మద్యం తాగి అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యంగా సైగలు చేయడం వంటివి చేస్తే అటువంటి ప్ర‌యాణికుల ప్ర‌వ‌ర్త‌నను 'లెవల్ 1'గా ప‌రిగ‌ణించి, వారికి మూడు నెలల వరకు నిషేధం విధిస్తామ‌ని చెప్పింది.

సిబ్బందిని నెట్టడం, దాడి చేయడం, అసభ్యంగా తాకడం వంటివి చేస్తే వారి ప్ర‌వ‌ర్త‌న‌ను లెవల్ 2 గా ప‌రిగ‌ణించి ఆరు నెలల వరకు నిషేధం విధిస్తామ‌ని పేర్కొంది. బెదిరింపులకు పాల్పడటం, ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌ను ధ్వంసం చేయడం వంటివి చేస్తే లెవల్ 3గా ప‌రిగ‌ణించి ఆ ప్ర‌యాణికులపై కనిష్ఠంగా రెండేళ్ల నుంచి జీవిత కాలం పాటు నిషేధం విధిస్తామ‌ని చెప్పింది.

  • Loading...

More Telugu News